మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో తమ నాయకుడు తిరిగి లోక్‌సభలో అడుగుపెడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మహ్మద్ ఫైజల్, రాహుల్ గాంధీ కేసులు చాలా దగ్గరగా ఉంటాయి. పరువు నష్టం కేసులో గాంధీకి రెండేళ్లు శిక్ష పడగా, హత్యాయత్నం కేసులో ఫైజల్‌కు 10ఏళ్లు శిక్ష పడింది. ప్రాతినిథ్య చట్టం ప్రకారం ఇద్దరూ తమ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఫైజల్‌పై అనర్హత వేటు జనవరిలో పడగా, రాహుల్‌పై వేటు మార్చిలో పడింది. తాజాగా మహ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించగా, త్వరలోనే రాహుల్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణలులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫైజల్ వ్వవహారాన్ని కేస్ స్టడీగా తీసుకోనున్న కాంగ్రెస్
హత్యాయత్నం కేసులో కేరళ సెషన్ కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఫైజల్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఫైజల్ జైలు శిక్షపై జనవరి 25న స్టే విధించింది. రెండు నెలలు తర్వాత కూడా లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ఈ క్రమంలో మంగళవారం ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరగకముందే, బుధవారం సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైజల్ కేసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వేచి చూసింది. ఈ కేసులో వచ్చిన ఫలితాన్ని బట్టి ముందుకెళ్లాని రాహుల్ అండ్ టీమ్ భావించింది. ఫైజల్ వ్వవహారాన్ని కేస్ స్టడీగా రాహుల్ సభ్యత్వాన్ని తిరిగి పొందే విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.