LOADING...
Petrol & Diesel :'పెట్రోల్, డీజిల్ లేదా LPG కొరత లేదు': ఇంధన ఆందోళనపై ఆయిల్ కంపెనీల క్లారిటీ 
'పెట్రోల్, డీజిల్ లేదా LPG కొరత లేదు': ఇంధన ఆందోళనపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

Petrol & Diesel :'పెట్రోల్, డీజిల్ లేదా LPG కొరత లేదు': ఇంధన ఆందోళనపై ఆయిల్ కంపెనీల క్లారిటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన రంగంపై ప్రభావం పడిందనే చర్చలు జోరందుకున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన దాడుల తర్వాత హార్ముజ్ జలసంధి మూసివేయబడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అంతరాయం కలిగింది. ఈ పరిణామాల మధ్య భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. అంతేకాదు, మళ్లీ 'లాక్‌డౌన్' తరహా ఆంక్షలు విధిస్తారనే ప్రచారం కూడా ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పష్టత ఇచ్చాయి.

వివరాలు 

పుకార్లను నమ్మొద్దు: ఆయిల్ కంపెనీల క్లారిటీ

పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థలు ప్రజలకు భరోసా కల్పించాయి. BPCL ప్రకటన: పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని స్పష్టం చేసింది. HPCL వివరణ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఎక్కడా లేదని పేర్కొంది. తగినంత స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. ప్రజలు భయంతో అధికంగా కొనుగోలు చేయకూడదని, సాధారణంగా వినియోగించాలని సూచించింది.

వివరాలు 

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ హెచ్చరిక

ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. చమురు, గ్యాస్, ఎరువులు వంటి కీలక వనరులు దేశానికి నిరంతరంగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితులు క్లిష్టమయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 11 సంవత్సరాల్లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల వల్ల ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఏర్పడిందని, ప్రజల ప్రయోజనాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

సోషల్ మీడియాలో లాక్‌డౌన్ చర్చలు… వాస్తవం ఏమిటి?

2020 మార్చి 24న దేశంలో అమలైన కరోనా లాక్‌డౌన్‌కు ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో, మళ్లీ అలాంటి ఆంక్షలు వస్తాయా? అన్న అనుమానాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే ప్రభుత్వం ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. లాక్‌డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. కేవలం చమురు, గ్యాస్ వంటి సహజ వనరులను జాగ్రత్తగా వినియోగించాలనే సూచనలు మాత్రమే చేస్తున్నట్టు తెలిపింది.

Advertisement