ISKCON: బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న ఇస్కాన్
ఇస్కాన్ (ISKCON)కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ (Chinmoy Krishnadas)ను బంగ్లాదేశ్ ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇస్కాన్ ఆలయ అధికారులు భారత కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకున్నారు. "ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్‌ను ఢాకా పోలీసులు అరెస్టు చేసిన విషయం మాకు తెలిసింది. అక్కడి అధికారులు ఇస్కాన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం దీనిపై తక్షణ చర్యలు తీసుకొని, బంగ్లాదేశ్ అధికారులతో చర్చించాలి. మా ఉద్యమం శాంతి, ప్రేమకు ప్రతీక అని వారికి వివరించాలి. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం," అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇస్కాన్ చేసిన ట్వీట్
బంగ్లాదేశ్ జెండాపై వివాదాస్పద వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, చిన్మోయ్ కృష్ణదాస్ ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి ఆయన కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఆందోళనకు దిగడం గమనార్హం.