విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అబుదాబి నుంచి ముంబయికు వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్ ఫ్లైట్ (యూకే 256)లో మరో సంఘటన జరిగింది. ఇటాలియన్ ప్రయాణీకురాలు విమానంలో మద్యం మత్తులో బీభత్సం చేయడంతో అమెను పోలీసులకు అప్పగించారు. ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకున్న ఆమె బిజినెస్ క్లాస్ సీటులో కూర్చోవడంతో విమానం సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె నానా రచ్చ చేశారు. సిబ్బంది కొట్టడం, ఉమ్మివేయడం లాంటి వికృత చేష్టలకు పాల్పడింది. అంతేకాదు, పాక్షికంగా బట్టులు విప్పి, అర్థనగ్నంగా విమానంలో నడిచింది. ఆమె ఆగడాలను భరించలేని విమాన సిబ్బంది, ముంబయి విమానాశ్రయం వచ్చేదాకా వెనక సీటుకు కట్టేశారు.
ప్రయాణికురాలి పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఉదయం 5:30గంటలకు విమానం ముంబయికి చేరుకోగానే ఇటాలియన్ ప్రయాణీకురాలిని సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఆమె పేరును పెరుక్కియోగా పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అంధేరి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలైంది. సిబ్బంది, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్లు డీసీపీ దీక్షిత్ గెడం పేర్కొన్నారు. విమానాల్లో ప్రయాణికుల ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఈ సంఘటనను వెంటనే విస్తారా ఎయిర్ లైన్స్ తెలియజేసింది.