LOADING...
Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం
అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం

Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్‌లాండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అంతర్గత జల రవాణా రంగం సామర్థ్యం, అందుబాటులో ఉన్న అవకాశాలను సమగ్రంగా పరిశీలించడంతో పాటు, భవిష్యత్తులో వృద్ధి, విస్తరణకు దోహదపడే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు.

వివరాలు 

అంతర్గత జల రవాణా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ 

వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అంతర్గత జల రవాణా అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రులు విస్తృతంగా చర్చించనున్నారు. ఐడబ్ల్యూటీ ప్రాజెక్టుల అమలులో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా ఒప్పందాలు కుదుర్చుకునే అంశం కూడా ఈ సమావేశంలో కీలకంగా ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో జల రవాణా వ్యవస్థల నిర్మాణం, సరకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రయాణీకుల కోసం పర్యావరణహిత హరిత నౌకల వినియోగం, నదీ క్రూయిజ్ పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ఐడబ్ల్యూడీసీ 3.0లో ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో పాటు సహాయ మంత్రి శంతను ఠాకూర్ పాల్గొననున్నారు. రాష్ట్రం తరఫున మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హాజరుకానున్నారు.

వివరాలు 

ఏటా 145 మిలియన్ టన్నుల సరకు రవాణా

ప్రస్తుతం దేశంలో అంతర్గత జలమార్గాల ద్వారా ప్రతి ఏడాది సుమారు 145 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతున్నట్లు అంచనా. రోడ్డు,రైలు మార్గాలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో 'జలవాహక్' పథకం కింద సరకు,ప్రయాణీకుల రవాణాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే 'జల్ సమృద్ధి' పథకం ద్వారా ప్రైవేటు ఆపరేటర్లను ఈ రంగంలోకి ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల వెంట అంతర్గత సరకు రవాణా గణనీయంగా పెరుగుతోంది. తక్కువ దూర కార్గో కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా ముక్త్యాల,హరిశ్ఛంద్రపురం సమీపంలో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. గోదావరి నదిలో క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆరు ప్రాంతాల్లో పంటూన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత జల రవాణా,పర్యాటక రంగాల విస్తరణపై ఐడబ్ల్యూడీసీ 3.0 ప్రత్యేక దృష్టి సారించనుంది.

Advertisement