Page Loader
Jagan: జగన్‌ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తతలు.. కాన్వాయ్‌ నుండి జారిపడిన వైకాపా నాయకుడు
జగన్‌ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తతలు.. కాన్వాయ్‌ నుండి జారిపడిన వైకాపా నాయకుడు

Jagan: జగన్‌ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తతలు.. కాన్వాయ్‌ నుండి జారిపడిన వైకాపా నాయకుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తన పర్యటన సందర్భంగా మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రతి పర్యటనను శక్తిప్రదర్శనగా మలచే వైకాపా నేతలు, ఈసారి కూడా అదే ధోరణిని కొనసాగించారు. బుధవారం ఉదయం బెంగళూరునుంచి బయలుదేరిన జగన్, అరగొండ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ అధికారికంగా కేవలం 30 మందికే అనుమతి ఇచ్చినప్పటికీ, భారీ సంఖ్యలో జనాలు అక్కడికి ప్రవేశించడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. అనుమతి లేకపోయినా హెలిప్యాడ్‌ నుంచి మార్కెట్‌ యార్డు వరకు వాహనాల మోతతో రోడ్‌షో నిర్వహించారు. పార్టీ శ్రేణులు నిర్బంధాలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున తరలివచ్చారు.

వివరాలు 

రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు 

గందరగోళ పరిస్థితుల్లో పోలీసులు కొద్దిపాటి లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో జగన్‌ కాన్వాయ్‌లో ఉన్న పార్టీ నేత విజయానంద రెడ్డి జారి పడిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు ఎస్పీ మణికంఠ మునుపే హెచ్చరించినప్పటికీ.. అనుమతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పినప్పటికీ.. వైకాపా శ్రేణులు ఖాతరు చేయలేదు. పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా రోడ్‌షోను ముందుకు కొనసాగించారు. బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో జగన్‌తో సమావేశం కావడానికి 500 మందికి అనుమతిచ్చారు. కానీ జగన్‌ రాకకు ముందే పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వివరాలు 

రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు 

వైకాపా నాయకులు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర ప్రయాణ మాధ్యమాల్లో కార్యకర్తలను తరలించారు. సత్యసాయి, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో గతంలో జగన్‌ పర్యటనల సందర్భంగా జరిగిన ఘర్షణాత్మక ఘటనల నేపథ్యంలో ఈ పర్యటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు విమర్శిస్తూ.. ఇది రైతుల పరామర్శ పర్యటన కాదని, బలప్రదర్శన దండయాత్రలా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.