Bengaluru: యలహంక ప్యాలెస్ వద్ద హైడ్రామా.. షర్మిలను అడ్డుకున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం మరో మలుపు తిరిగింది. ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశించకూడదని దేవనహళ్లి సివిల్ కోర్టు శనివారం మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్యాలెస్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేశ్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై దేవనహళ్లి సివిల్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆదివారం సాయంత్రం తన తల్లి విజయమ్మ, కుమారుడు, కుమార్తెతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే యలహంక పోలీసులు వారికి భద్రత కల్పించారు.
వివరాలు
షర్మిలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం
అక్కడి నుంచి షర్మిల లీలాప్యాలెస్ హోటల్‌కు బయలుదేరారు.
అయితే మార్గమధ్యలో యలహంక ప్యాలెస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు.
కోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం ప్యాలెస్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో షర్మిలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లీలాప్యాలెస్ హోటల్‌కు వెళ్లేందుకు అవసరమైన జడ్ ప్లస్ భద్రత కల్పిస్తామని పోలీసులు తెలిపారు.
అయితే యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లడానికి, ఆ మార్గంలో ప్రవేశించడానికి మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు.
దీంతో షర్మిల అక్కడి నుంచి లీలాప్యాలెస్ హోటల్‌కు వెళ్లిపోయారు. తన కుమార్తె వివాహ కార్యక్రమాల ఏర్పాట్ల కోసం షర్మిల, ఆమె బంధువులు ఈ హోటల్‌లోనే సన్నాహాలు చేస్తున్నారు.
వివరాలు
నేడు కోర్టులో ఏం జరగనుంది?
యలహంక ప్యాలెస్‌కు సంబంధించి కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు డిసెంబరు 19న హాజరుకావాలని షర్మిల తరఫు న్యాయవాదులను దేవనహళ్లి సివిల్ కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
మరోవైపు ప్యాలెస్‌లోని వాటాలకు సంబంధించిన అంశంపై వాదనలు వినిపించేందుకు సోమవారం అవకాశం కల్పించింది.
ఈ నేపథ్యంలో సోమవారం షర్మిల తరఫు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. ఈ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.