
Vice President Race: ఉపరాష్ట్రపతి ఎంపికపై బీజేపీ దృష్టి.. నెక్ట్స్ ఈ రేసులో ఎవరున్నారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. సోమవారం రాత్రి ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనారోగ్య కారణాలే తన రాజీనామాకు కారణమని ఆ లేఖలో ధన్‌ఖడ్ స్పష్టంచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన అదే రోజున ఆయన రాజీనామా చేయడం విశేషం. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలను డిప్యూటీ చైర్మన్,జేడీయూ నేత హరివంశ్ నిర్వహించనున్నారు. 2022 ఆగస్టు 11నఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించిన ధన్‌ఖడ్, 2027 ఆగస్టు వరకు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ, పదవీ కాలం పూర్తి కాకముందే రెండేళ్ల 344రోజులకే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి ఆయన వయసు 74 సంవత్సరాలు. ధన్‌ఖడ్ రాజీనామాతో తరువాత ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారు అనే ఆసక్తి నెలకొంది.
వివరాలు
ఉపరాష్ట్రపతి ఎంపికపై మరింత ఆసక్తి
ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ లోపల చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి పలు ప్రముఖుల పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎలక్టోరల్ కాలేజీ అయిన లోక్‌సభ,రాజ్యసభల్లో ఎన్డీయేకు మెజారిటీ ఉండటం వల్ల,తదుపరి ఉపరాష్ట్రపతి ఎంపికపై మరింత ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే, వివాదాస్పదమైన వ్యక్తిని కాకుండా,అనుభవజ్ఞుడైన, నిష్పక్షపాతమైన నేతను బీజేపీ ఎంపిక చేయవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గవర్నర్లు, బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులలో ఒకరిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. బీజేపీ ఎంపీల నుంచి అందిన సమాచారం ప్రకారం, జేడీయూ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు కూడా ఈ దిశగా చర్చలో ఉందని తెలుస్తోంది.
వివరాలు
పదవి ఖాళీ అయిన 6 నెలల్లోపే కొత్త ఉపరాష్ట్రపతి
2020 నుండి డిప్యూటీ చైర్మన్‌గా కొనసాగుతున్న హరివంశ్‌ను కేంద్రం నమ్మకమైన వ్యక్తిగా చూస్తున్నట్టు సమాచారం. నియమావళి ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 6 నెలల్లోపే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికలు జరిగే వరకు రాజ్యసభలో సమావేశాలు నడిపే బాధ్యత డిప్యూటీ చైర్మన్‌కి అప్పగించబడుతుంది.