Page Loader
Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌
132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌

Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌(Jagjit Singh Dallewal)తన దీక్షను నేడు విరమించారు. పంటలకు కనీస మద్దతు ధర(MSP)పై చట్టబద్ధ హామీతో పాటు ఇతర కీలక డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ దీక్ష లక్ష్యంగా సాగింది. గతేడాది నవంబర్ 26న దల్లేవాల్‌ ఈ దీక్ష ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రైల్వేశాఖ సహాయ మంత్రి రణ్‌వీత్‌సింగ్‌ బిట్టు ఆయనను దీక్ష విరమించుకోవాలని కోరిన మరుసటి రోజు, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా సిర్హింద్‌లో జరిగిన 'కిసాన్ మహా పంచాయత్'లో దీక్షను విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Details

అందరికి రుణపడి ఉంటాను

ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని మీరు కోరారు. ఉద్యమాన్ని నిశ్శబ్దంగా, శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానని, మీ భావోద్వేగాలను గౌరవిస్తూ, మీరు ఇచ్చిన ఆదేశాలకు లోబడి దీక్షను విరమిస్తున్నానని హృదయపూర్వకంగా స్పందించారు. దల్లేవాల్‌ ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఆధ్వర్యంలో ఏర్పాటైన వేదికలో కీలక నేతగా ఉన్నారు. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దీర్ఘకాలం పాటు పోరాటం చేశారు. కేంద్ర ప్రభుత్వం జనవరిలో చర్చల కోసం రైతులను ఆహ్వానించగా, దల్లేవాల్‌ తాను దీక్ష చేస్తున్న స్థలంలోనే వైద్య సాయం పొందేందుకు అంగీకరించారు. అయినా ఆయన తన నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.

Details

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌

తాజాగా శనివారం, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ ద్వారా రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని వెల్లడించారు. మే 4న ఉదయం 11 గంటలకు తదుపరి సమావేశం జరుగుతుందని ప్రకటించారు. అంతేగాక, దల్లేవాల్‌ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తన సహానుభూతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 132 రోజులపాటు కొనసాగిన దీక్షకు ముగింపు పలికిన దల్లేవాల్‌ ధైర్యం, పట్టుదల దేశవ్యాప్తంగా రైతుల్లో కొత్త ఉద్వేగం కలిగించింది.