చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు
పౌల్ట్రీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల సరికొత్త యంత్రాన్ని జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఆవిష్కరించాడు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని మునాద్ గుఫ్ఫాన్ గ్రామానికి చెందిన మోమిన్ ఇషాక్ చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను రూపొందించాడు. మోమిన్ ఇషాక్ తండ్రి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. రోజువారి కూలి ఈ ఘనత సాధించడపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోమిన్ ఇషాక్ మునద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో గ్రేడ్ చదవుతున్నాడు. పౌల్ట్రీ వ్యాపారాన్ని చేయాలనుకునే వారికి ఈ చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్ చాలా మొత్తంలో పెట్టుబడిని ఆదా చేస్తుంది. గుడ్లు పొదగడానికి నియంత్రిత వాతావరణాన్ని అందించడం కోసం పౌల్ట్రీ వ్యాపరస్థులు ఇంక్యుబేటర్‌ను ఉపయోగిస్తారు.
ఇంక్యుబేటర్ కోసం రెండేళ్ల కష్టపడ్డ మోమిన్
మార్కెట్‌లో విస్తారంగా ఉన్న రంగు కోడిపిల్లల పట్ల ఉన్న ఆకర్షణతో పాటు, బ్రాయిలర్ కోళ్ల పెంపకంపై ఉన్న ఆసక్తి మోమిన్‌ను ఇంక్యుబేటర్ రూపొందించడం వైపు మళ్లించాయి. తాను బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నానని, అవి గుడ్లు పొదిగేవి కావని మోమిన్ చెప్పాడు. అందుకే తక్కువ ధరలో గుడ్డు ఇంక్యుబేటర్‌ను కనిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి విజయవంతంగా ఇంక్యుబేటర్‌ను కనిపెట్టినట్లు మోమిన్ చెప్పాడు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు ఆరాధ్యదైవమని మోమిన్ వెల్లడించాడు. తన గ్రామమే కాకుండా దేశం మొత్తం గర్వపడేలా మరిన్ని వినూత్న పరికరాలను రూపొందించడంపై తాను ఇప్పటికే దృష్టి పెట్టానని మోమిన్ చెప్పాడు.