టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఛైర్మన్ రానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ సారథిగా కొనసాగుతున్నారు. అయితే తొలి విడత పదవీ కాలం పూర్తి అయ్యాక మరోసారి వైవీనే ఏపీ సర్కార్ ఛైర్మన్ గా కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి స్థానంలో జంగా నియామకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ కు నమ్మినబంటుగా, అత్యంత ఆప్తుడుగా ఇప్పటికే కృష్ణమూర్తి గుర్తింపు పొందారు.
DETAILS
ఎన్నికల వేళ పార్టీకి వైవీ సుబ్బారెడ్డి సేవలు
మరోవైపు ఎన్నికల వేళ పార్టీకి వైవీ సుబ్బారెడ్డి అవసరం ఉన్న క్రమంలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
బీసీల్లో పట్టున్న ఉద్యమ నేత జంగాకు ప్రతిష్టాత్మకమైన టీటీడీ పదవి కట్టబెట్టి బీసీలకు దగ్గరయ్యేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. బీసీల నేతగా పేరున్న జంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన సీఎం జగన్, తాజాగా మరో పదవిని అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ పదవీ కాలం ఆగస్ట్ 12తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని నియమించే ప్రక్రియపై అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.