Page Loader
RSS Remarks Case: ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చిన గీత రచయితకి బిగ్ రిలీఫ్
ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చిన గీత రచయితకి బిగ్ రిలీఫ్

RSS Remarks Case: ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చిన గీత రచయితకి బిగ్ రిలీఫ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు పెద్ద ఊరట లభించింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను తాలిబాన్‌తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించబడింది. ఈ కేసు రాజీ కుదిరిన తరువాత, ఫిర్యాదుదారుడు కేసును వెనక్కి తీసుకున్నారు. ములుంద్ కోర్టులో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ SD చక్కర్ ఈ కేసును పరిశీలించగా, నవంబర్ 8న తీర్పు వెలువడింది. ఆ తీర్పు కాపీ ఈరోజు (సోమవారం) అందుబాటులోకి వచ్చింది. 2021లో, జావేద్ అక్తర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ నేత, న్యాయవాది సంతోష్ దూబే లీగల్ నోటీసు జారీ చేసి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

జావేద్ అక్తర్‌ నిర్దోషి

అక్తర్ ఆ డిమాండ్‌ను నిరాకరించడంతో, సంతోష్ దూబే 2022లో క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ, అక్తర్ ఆ సమన్లను ముంబై సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. మార్చి 2023లో సెషన్స్ కోర్టు సమన్లను సమర్థించింది. సంతోష్ దూబే తన పిటిషన్‌లో, జావేద్ అక్తర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, అలాగే ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే, అనేక వాయిదాల తరువాత ఇరు వర్గాలు సామరస్యానికి వచ్చి కేసును పరిష్కరించుకున్నారు. ఫిర్యాదుదారుడు కేసు ఉపసంహరించుకోవడంతో, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జావేద్ అక్తర్‌ను నిర్దోషిగా ప్రకటించారు.