Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్.. నేడు ప్రమాణ స్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపై సోరెన్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనను ముఖ్యమంత్రి హోదాలో నియమించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అయితే 10 రోజుల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. చంపయీ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ను గురువారం కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ శాసనసభ్యుడు వినోద్ సింగ్, శాసనసభ్యుడు ప్రదీప్ యాదవ్ ఉన్నారు.
39 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు..
చంపై సోరెన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్‌తో సహా 39 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణం వాయిదా పడింది. నేడు వారు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చేత హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, అతని అరెస్టు తర్వాత చంపై సోరెన్ JMM శాసనసభా పక్షానికి కొత్త నాయకుడు అయ్యాడు.