నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌కు కమిటీలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.
అయితే ఆయా ఉద్యోగులను నీటిపారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణపై ప్రగతిభవన్‌లో అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు.
విద్యార్హతలు, సామర్థ్యాల ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
details
జులై 12 నుంచి మంత్రివర్గ ఉపసంఘం చర్చలు
నేటి నుంచి వీఆర్ఏలతో ఈ మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. అనంతరం వీఆర్ఏల అభిప్రాయాలను నమోదు చేయనున్నారు.
ఉపసంఘం తుది నివేదిక సమర్పించాక మరోసారి సమీక్ష చేపట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికారులకు, ఉప సంఘానికి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ( జేపీఎస్)ల క్రమబద్దీకరణపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. తమను పర్మినెంట్ చేయాలని గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 16 రోజుల సమ్మె కూడా నిర్వహించారు.
దీంతో దిగివచ్చిన ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే వాటికి సంబంధించి కొత్త విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ అయ్యాయి.
details
జేపీఎస్‌ల పని తీరు మదింపుపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు
జేపీఎస్‌ల పని తీరు మదింపుపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పరచాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
ఈ మేరకు కమిటీలో కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, డీఎఫ్ఓ, ఎస్పీ లేదా డీసీపీలు సభ్యులుగా ఉండనున్నారు.
రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ, లేదా హెచ్ఓడీ అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
జేపీఎస్‌ల పని తీరు మదింపుపై జిల్లా కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం స్టేట్ కమిటీ, సీఎస్ శాంతికుమారికి నివేదిక సమర్పిస్తారు.
అన్ని పూర్తయ్యాక జేపీఎస్ రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
నిర్ధేశించిన లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న వారినే క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై జేపీఎస్ లు ఆందోళన చెందుతున్నారు.