దిల్లీలో తెలంగాణ రాజకీయాలు : ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరిన జూపల్లి
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరుకున్నారు. ఈ మేరకు దిల్లీలో జూపల్లి సహా ఇతర నేతలకు ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లి బుధవారమే పార్టీలోకి రావాల్సి ఉండగా ఖర్గే బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్వర్ రెడ్డి, వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి,కిచ్చారెడ్డి సహా పలువురు నేతలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సమగ్ర ప్రగతి, శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు ఖర్గే ట్వీట్ చేశారు.