నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ 2020లో దిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడిందో తనకు తెలియదని అన్నారు.
బెంగళూరులో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.
దేశంలోని అత్యంత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరిగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు వరకు ఎందుకు ఎదగలేకపోయారని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరి 26, 2020న మురళీధర్ నేతృత్వంలోని దిల్లీ హైకోర్టు బెంచ్ సీఏఏ అల్లర్లపై దర్యాప్తు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసింది.
అల్లర్ల బాధితులకు భద్రత, చికిత్స అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు కేంద్రానికి ఎందుకు కలవరపెట్టాయో అర్థమవడం లేదని ఆయన అన్నారు.
దిల్లీ
ఆ ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బదిలీ: ఎస్.మురళీధర్
2020ఫ్రిబ్రవరిలో ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టం మద్దతుదారులు, చట్టాన్ని వ్యతిరేకించే వారికి మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
అల్లర్లలో 53మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి బీజేపీ నాయకులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై 24గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ ఎస్.మురళీధర్ నాయకత్వంలోని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.
ఈ ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ ప్రభుత్వం జస్టిస్ ఎస్.మురళీధర్‌ను చండీగఢ్ హైకోర్టుకు బదిలీ చేసింది.
ఆ తర్వాత దిల్లీ అల్లర్ల కేసును విచారణ వాయిదా వేసింది. జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీతో దిల్లీ పోలీసులకు, బీజేపీ నాయకులకు భారీ ఊరట లభించింది.
ఆ తర్వాత ఏ బీజేపీ నాయకుడిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం.
దిల్లీ
ఏ న్యాయమూర్తి అయినా నాలాగే వ్యవహరిస్తారు: జస్టిస్ ఎస్.మురళీధర్
దిల్లీ అల్లర్ల కేసు విచారణ విషయంలో కేంద్రం ఎందుకు ఆందోళన చెందిందో తనకు నాకు తెలియదని జస్టిస్ ఎస్.మురళీధర్ వెల్లడించారు.
తాను మాత్రమే కాదని, ఏ న్యాయమూర్తి అయినా తనలాగే వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.
మిగతా న్యాయమూర్తులు కూడా తన కన్నా భిన్నంగా చేసి ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం దేనికి దిగులు చెందిందో, తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.
ఫిబ్రవరి 26, 2020న తన నివాసంలో అత్యవసరంగా అర్ధరాత్రి కూడా కేసును విచారించారు.
తీవ్రంగా గాయపడిన 22 మంది బాధితులకు మంచి చికిత్స అందించడం కోసం ఈ మేరకు ఆయన అర్థరాత్రి ఆదేశాలు జారీ చేశారు.