Justice Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13న ముగుస్తుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్రం అక్టోబర్ 24న నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయబోతున్న జస్టిస్ ఖన్నా న్యాయ వ్యవస్థలోకి 1960 మే 14న అడుగుపెట్టారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఢిల్లీ మోడ్రన్ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఖన్నా, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్యాభ్యాసం చేశారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా చేరి న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ కౌన్సిల్‌గా పని చేసిన ఖన్నా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా సేవలు అందించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు.
ముఖ్యమైన తీర్పులు, పబ్లిక్ సేవలు
జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులను ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై నిర్ణయంతో పాటు, ఆర్టికల్ 370 రద్దు వంటి వివాదాస్పద అంశాల్లో తీర్పులు ఇచ్చారు. ఈవీఎంల వాడకాన్ని సమర్థిస్తూ బ్యాలెట్ పేపర్ పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ జస్టిస్ ఖన్నాకు తెల్లవారుజామున వాకింగ్ చేయడం ఎంతో ఇష్టం. ''ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది,'' అని చెబుతారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా, సీజేఐగా బాధ్యతలు స్వీకరించాక ఇంట్లోనే వాకింగ్, జిమ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.