
Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులు ఎటాచ్.. నీటిపారుదల శాఖ సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసే సమయంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయటపడటంతో, సంబంధిత ఇంజినీర్ల ఆస్తులను ఎటాచ్ చేయాలని విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో కార్యనిర్వాహక ఇంజినీరు నూనె శ్రీధర్,చీఫ్ ఇంజినీరు భూక్యా హరిరాం,మాజీ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ ల నివాసాలు,ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ(ACB)దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.ఇటీవల అనిశా డైరెక్టర్ నీటిపారుదల శాఖకు నివేదిక పంపి,నూనె శ్రీధర్,భూక్యా హరిరాంల ఆస్తుల వివరాలను అందించారు. వాటి ఆధారంగా నీటిపారుదల శాఖ ఎటాచ్ ప్రతిపాదన పంపగా,విజిలెన్స్ కమిషన్ దానికి ఆమోదం తెలిపింది. కేసు తుది తీర్పు వచ్చే వరకు ఆ ఆస్తుల కొనుగోలు,అమ్మకాలు లేదా బదిలీలు చేయరాదని స్పష్టం చేసింది.
వివరాలు
₹110 కోట్ల ఆస్తుల యజమాని నూనె శ్రీధర్
నీటిపారుదల శాఖలో ఏఈఈగా చేరిన నూనె శ్రీధర్,అరెస్ట్ అయ్యే సమయానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఉన్నారు.అనిశా దర్యాప్తులో శ్రీధర్,ఆయన భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు బినామీల పేర్లపై అనేక ఆస్తులు నమోదు చేసినట్లు బయటపడింది. ఎటాచ్ చేసిన ఆస్తులు: తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ఫ్లాట్, కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, అమీర్‌పేటలో కమర్షియల్ స్థలం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో మూడు ఇళ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు నగరాల్లో విలువైన 19 స్థలాలు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, రూ.1 కోటి బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. అధికారికంగా వీటి విలువ రూ.14 కోట్లు కాగా, మార్కెట్ ధర ప్రకారం ఇవి సుమారు రూ.110 కోట్లుగా అంచనా.
వివరాలు
₹90 కోట్ల ఆస్తులతో భూక్యా హరిరాం
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకం,తర్వాత రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన భూక్యా హరిరాం కూడా అవినీతి ఆరోపణలపై మే నెలలో అనిశా ద్వారా అరెస్టయ్యారు. అరెస్ట్ సమయానికి ఆయన గజ్వేల్ ఈఎన్సీగా, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఉన్నారు. అనంతరం శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. ఎటాచ్ చేసిన ఆస్తులు: షేక్‌పేట,కొండాపూర్‌లలో రెండు విల్లాలు,శ్రీనగర్,మాదాపూర్,నార్సింగిలలో మూడు ఫ్లాట్లు,అమరావతిలో రెండు వాణిజ్య స్థలాలు,సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి,పటాన్‌చెరులో 20 గుంటల స్థలం,హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇళ్లు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల మామిడి తోటతో ఫార్మ్‌హౌస్,కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం,మిర్యాలగూడ,కుత్బుల్లాపూర్‌లలో రెండు స్థలాలు,రెండు కార్లు,బంగారు నగలు,రూ.1.5 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.
వివరాలు
మురళీధర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా
అధికారికంగా వీటి విలువ రూ.11.46కోట్లు కాగా,మార్కెట్ ధర ప్రకారం రూ.90 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మాజీ ఇంజినీర్ ఇన్‌చీఫ్ చీటి మురళీధర్‌పై కూడా జులైలో అవినీతి నిరోధక శాఖ దాడులు జరిపింది. విచారణలో ఆయన ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తుల అంచనా రూ.100 కోట్లకు పైగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తులను కూడా ఎటాచ్ చేయాలని అనిశా నీటిపారుదల శాఖకు సూచించగా, శాఖ విజిలెన్స్ కమిషన్‌కు నివేదిక పంపినట్లు సమాచారం. మురళీధర్ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన విషయం గుర్తించదగ్గది.