Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.
జనవరి 15 రాత్రి సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని సూచించారు.
రాత్రి 11.30 గంటల వరకు తీర ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 1 మీటర్ వరకు అలల ప్రభావం ఉంటుందని, ఇది తీర ప్రాంతాలపై ముప్పును మరింత పెంచుతుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీవోఐఎస్) వెల్లడించింది.
వివరాలు
బీచ్‌లకు పర్యాటకులు రాకుండా ఆంక్షలు
ఈ హెచ్చరికల నేపథ్యంలో, కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ (కేఎస్‌డీఎంఏ) అప్రమత్తమైంది.
తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఆదేశాలు జారీ చేసింది.
తీర ప్రాంత వాసులు చిన్న పడవలు, దేశవాళీ పడవలను ఉపయోగించి సముద్రంలోకి వెళ్లడం పూర్తిగా మానుకోవాలని హెచ్చరించింది.
పడవలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని స్పష్టం చేసింది.
బీచ్‌లకు పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించింది. తీర ప్రాంతాల్లో అదనపు నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను కేఎస్‌డీఎంఏ ఆదేశించింది.
వివరాలు
కల్లక్కడల్‌అంటే ఏమిటి?
కల్లక్కడల్ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పులను సూచించే పదం. ఇది హిందూ మహాసముద్రం దక్షిణ భాగంలో కొన్ని సందర్భాల్లో వీచే బలమైన గాలుల ప్రభావంతో సముద్రం ఆకస్మికంగా ఉప్పొంగడం వల్ల ఏర్పడుతుంది. ఈ గాలులు ఎలాంటి సూచనలూ లేకుండా అకస్మాత్తుగా వీచడం వల్ల సముద్రంలో అలల తీవ్రత పెరుగుతుంది. ఈ కారణంగా దీనిని స్థానికంగా "కల్లక్కడల్" అని పిలుస్తారు.
ఇందుకు సంబంధించిన హెచ్చరికలు ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.