Madakasira Kalyani: మడకశిరలో భారీ పెట్టుబడితో కొత్త పరిశ్రమ.. రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు
శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్త పరిశ్రమ ప్రారంభం కాబోతుంది. మడకశిర మండలంలోని మురా రాయన హల్లి గ్రామంలో "కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్" సంస్థ ఏర్పాటు అవుతోంది. రూ. 1430 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను 1000 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 565 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. మరోవైపు, పరోక్షంగా వందల మంది ఉద్యోగాలను పొందవచ్చని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండగా, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
భారీ పరిశ్రమల స్థాపనకు చర్యలు
ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి, భారీ పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో అనేక పరిశ్రమలు వేధింపుల కారణంగా తరలిపోగా, వాటిని తిరిగి రాష్ట్రంలో తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి వివరించారు.