
Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం నేపథ్యంలో, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ సందర్శన చేసింది.
ఈ భూములపై జరిగిన చదును పనులపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే.
టీజీఐఐసీ చేపట్టిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, కమిటీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బుధవారం, సెంట్రల్ ఎంపవర్‌డ్ కమిటీ ఛైర్మన్ సిద్ధాంత్ దాస్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Details
కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం
వారు ఏప్రిల్ 10, 11 తేదీల్లో కంచ గచ్చిబౌలిలో భూ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం నిర్వహించే అవకాశముంది. ఇక, టీజీఐఐసీ అధికారులు భూములు ప్రభుత్వానివేనంటూ పలుచోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.
కేంద్ర కమిటీ రాకతో హెచ్‌సీయూ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఈస్ట్ క్యాంపస్‌కి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. కమిటీ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.