
Kandula Durgesh:ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు మూసేయాలన్న ప్రచారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదలకు ముందు పక్కా ప్లాన్ ప్రకారం నలుగురు వ్యక్తులు థియేటర్లు మూసేయాలనుకుంటూ కుట్ర చేసినట్టు జనసేన ఆరోపించడంతోనే ఈ విచారణ ఆదేశాలిచ్చారు.
ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినీ రంగాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందని తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు, రాష్ట్రంలో సినిమాల నిర్మాణ కార్యకలాపాలు పెరగేందుకు ప్రభుత్వంగా అన్ని విధాల సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
రూపాయి టికెట్ ధర పెరిగితే ప్రభుత్వానికి పావల ఆదాయం
సినిమాల చిత్రీకరణ అనుమతులను మరింత సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని బలపరిచేలా చర్యలు తీసుకోవడం, అలాగే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ స్థాపనకు సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
గత దశాబ్దం కాలంగా సినిమా టికెట్ ధరలపై వివాదం కొనసాగుతుందని గుర్తు చేస్తూ... నిర్మాతలు ధరలు పెంచాలని కోరిన సందర్భంలో పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే ఒక్క రూపాయి టికెట్ ధర పెరిగితే ప్రభుత్వానికి దాదాపు పావల ఆదాయం లభిస్తుందని వివరించారు.
గతంలో సినిమా రంగానికి చెందిన కొంతమంది వ్యక్తులు వేధింపులు ఎదుర్కొన్నట్లు వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అది వాస్తవం కాదని తేల్చిచెప్పారు.
వివరాలు
తెలుగు సినిమా పరిశ్రమకు నిత్యం అండగా
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు నిత్యం అండగా నిలుస్తున్నామని తెలిపారు.
తెలుగు సినిమాలు మన రాష్ట్రానికి గర్వకారణం కావడంతో, వాటికి తగిన స్థాయిలో ప్రోత్సాహం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఇంకా ప్రతి సారి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే ఇలాంటి వివాదాలు తలెత్తడం దురదృష్టకరమని విమర్శించారు.
'హరిహర వీరమల్లు' సినిమాపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అనుచితమని, సినిమా విడుదలకి ముందే బాధ్యత లేని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.
అంతేకాక, ఆయనలో మానవత్వం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.