చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
చంద్రబాబు కండువా కప్పి కన్నాను ఆహ్వానించారు. దాదాపు 3వేల మంది అనుచరులతో కలిసి కన్నా టీడీపీలో చేరారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఇటీవల కన్నా రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. సోము వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తమ వర్గీయులకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు కన్నా
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాపు సామాజికవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. కన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారామణ టీడీపీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
అంతేకాకుండా గుంటూరు జిల్లా రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉండటంతో పార్టీకి ఆయన ప్లస్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే టీడీపీలో చేరికలు కన్నా లక్ష్మీనారాయణతో ఆగవని, ఇంకా చాలమంది చంద్రబాబు నాయకత్వంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని నాయకులు చెబుతున్నారు.