బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. సోము వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తమ వర్గీయులకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాపు సామాజికవర్గం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
కన్నా లక్ష్మీనారాయణ రానున్న రోజుల్లో జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికలకు 14 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాపు సామాజికవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. కన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అటు జనసేన, ఇటు టీడీపీ ఆయనను చేర్చుకునేందకు ఆసక్తిని కనబర్చుతున్నాయి.
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉండటంతో ఏ పార్టీలో చేరినా, ఆ పక్షానికి ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.