Kanpur: కాన్పూర్‌లో పూణే పోర్షే తరహా ప్రమాదం.. కారు నడిపి ఇద్దరు మృతికి కారకుడైన మైనర్
పూణే పోర్షే కారు ప్రమాదం తరహాలోనే ఓ యువకుడు తన తండ్రి కారుతో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. నివేదికల ప్రకారం, ఈ సంఘటన అక్టోబర్ 2023 లో జరిగింది. అయితే కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత, అతన్ని జువైనల్ రిఫార్మ్ హోమ్‌కు పంపారు. మైనర్ ప్రముఖ వైద్యుడి కుమారుడు. అక్టోబర్ 27న కేసు నమోదైంది.
మైనర్ ఇప్పటికే నలుగురిని గాయపరిచాడు
ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ హరీశ్ చందర్ తెలిపారు. మైనర్ వాహనం నడుపుతున్నట్లు విచారణలో తేలింది. 6 నెలల తర్వాత, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మే 21న జువైనల్ కరెక్షనల్ హోంకు తరలించారు. మైనర్ గతంలో మార్చిలో బర్రా ప్రాంతంలో కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురిని గాయపరిచాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కూడా బయటపడింది.
పోలీసు అధికారులపై చర్యలు
రెండు ప్రమాదాల్లో మైనర్ నిందితుడు ప్రాథమికంగా దోషిగా ఉన్నప్పటికీ స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాల నుంచి సమాచారం అందింది. గతంలో కేసుల్లో నిందితుడిపై, అతని తండ్రిపై ఫిర్యాదు చేశామని, అయితే చార్జిషీట్ దాఖలు చేయలేదని హరీష్ చందర్ తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.