కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన కన్వర్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఐదుగురు భక్తులు మృతిచెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. భావన్‌పూర్ పరిధిలోని రాలీ చౌహాన్ గ్రామంలో ఊరేగింపు సమయంలో హై టెన్షన్ వైర్లు తగిలి ఐదుగురు కన్వారియా భక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. పరమశివుడి భక్తులైన కన్వారియాలు హరిద్వార్ నుంచి పవిత్ర గంగానది నీటితో తిరిగి వస్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. కన్వారియాల బస్సు గ్రామంలోకి వస్తుండగా, కిందకు వేలాడున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు వాహనానికి తగిలాయి. దీంతో వాహనం మొత్తానికి క్షణాల్లో విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో కన్వారియా భక్తులు విద్యుత్ షాక్ బారిన పడ్డారు.
కన్వర్ యాత్రకు సన్నాహాలు చేయడంలో విద్యుత్ శాఖ విఫలం : గ్రామస్తులు
రాలీ చౌహాన్ గ్రామస్తులు వెంటనే విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి, కరెంట్ సరఫరాను నిలిపేశారు. అయితే అప్పటికే భక్తుడు మనీష్ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరో ఐదుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రహదారిలో బైఠాయించారు. దేశంలోనే అతిపెద్ద యాత్రల్లో ఒకటైన కన్వర్ యాత్రకు సన్నాహాలు చేయడంలో విద్యుత్ శాఖ విఫలమైందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.