Page Loader
సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి
కర్ణాటక: 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది

సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి

వ్రాసిన వారు Stalin
Apr 05, 2023
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంగళూరులోని మందారకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కర్ణాటకలో భారీ రైలు ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడింది. తనకున్న అనారోగ్య సమస్యను కూడా లెక్క చేయకండా వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు ఆమె పడ్డ తపన లక్షల మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. దీంతో ఆ వృద్ధురాలుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో తన ఇంటి బయట ఉన్న చంద్రావతి అనే 70ఏళ్ల వృద్దురాలు పాడిల్-జోకట్టె మధ్య ట్రాక్‌పై చెట్టు పడిపోవడాన్ని గమనిచింది. మంగళూరు నుంచి ముంబయి వెళ్లే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్‌ అటుగా వెళ్తుందని తెలిసిన చంద్రావతి తన ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఓ ఎర్రటి గుడ్డ తెచ్చి ఎదురుగా వస్తున్న రైలులోని లోకో పైలట్‌కి చూపింది.

కర్ణాటక

గుండె ఆపరేషన్ అయిన విషయాన్ని మరిచిపోయి పరుగెత్తా: చంద్రావతి

చంద్రావతి చూపించిన ఎర్రటి గుడ్డను గమనించిన లోకో పైలట్, ప్రమాదాన్ని పసిగట్టి, ట్రాక్‌పై రైలు వేగాన్ని తగ్గించాడు. అనంతరం రైల్వే సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని చెట్టును ట్రాక్‌పై నుంచి తొలగించారు. దీంతో చంద్రావతి పెను ప్రమాదాన్ని నివారించిందని రైల్వే అధికారులు ప్రశంసించారు. రైల్వే అధికారులు సహా రైల్వే పోలీసులు మంగళవారం చంద్రావతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ.. చెట్టు ట్రాక్‌పై పడిపోవడాన్ని గమనించిన వెంటనే ఎవరికైనా సమాచారం అందించాలని ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయానికి రైలు హారన్‌ విని సమయం లేదని గ్రహించి ఎర్రటి గుడ్డతో బయటకు పరుగెత్తినట్లు ఆమె చెప్పారు. ఆ సమయంలో తనకు గుండె ఆపరేషన్ అయిన విషయాన్ని కూడా మరిపోయినట్లు చంద్రావతి తెలిపింది.