Page Loader
నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 
నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 

వ్రాసిన వారు Stalin
May 13, 2023
07:29 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 224అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన 2,615మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 36కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్ణాటకలో 73.19శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ సారి 2018లో నమోదైన 72.36శాతాన్ని అధిగమించింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావితం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ కోసం ఒక పార్టీకి 113సీట్లు అవసరం.

కర్ణాటక

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?

మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేశాయి. అలాగే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని స్పష్టం చేశాయి. న్యూస్ 24-టుడే చాణక్య బీజేపీ 92సీట్లు, కాంగ్రెస్‌120, జేడీఎస్‌12సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. టైమ్స్ నౌ-ఈటీజీ పోల్, ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ బీజేపీ 85, కాంగ్రెస్ 113, జేడీ-ఎస్ 23, ఇతరులు మూడు సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 83-95, కాంగ్రెస్‌కు 100-112, జేడీ(ఎస్)కి 21-29, ఇతరులకు 2-6సీట్లు వస్తాయని వెల్లడించింది. టీవీ9 భరతవర్ష్-పోల్‌స్ట్రాట్ పోల్ హంగ్ అసెంబ్లీని అంచనా వేసింది. బీజేపీ 88-98 సీట్లు, కాంగ్రెస్ 99-109 సీట్లు, జేడీఎస్ 21-26 సీట్లు, ఇతరులు 0-4 సీట్లు గెలుస్తారని పేర్కొంది.