Page Loader
కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం
నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 28, 2023
06:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఐదు హామీలను ఇచ్చింది. అందులో ఒకటైన అన్నభాగ్య పథకం అమలుకు బియ్యం కొరత ఏర్పడింది. జులై 1 నుంచి ఈ పథకం అమల్లోకి రావాల్సి ఉండగా, ఇందుకు అవసరమైన బియ్యం దొరకలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అన్న పథకంలో భాగంగా లబ్దిదారులకు ఉచిత బియ్యానికి బదులుగా డబ్బులిస్తామని పేర్కొంది.కిలో బియ్యానికి రూ.34 చొప్పున 5 కిలోలకు సమానమైన నగదును రేషన్ కార్డుదారులకు బదిలీ చేస్తామని స్పష్టం చేసింది.

DETAILS

కార్డులో ఎంత మంది ఉంటే అంతమందికి కలిపి అందిస్తాం: మునియప్ప

అయితే తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తరఫున బియ్యం పంపిణీ చేసేందుకు చాలా ప్రయత్నించామని పౌర సరఫరాల శాఖ మంత్రి మునియప్ప తెలిపారు. రాష్ట్రానికి కావాల్సిన బియ్యాన్ని సరఫరా అందించేందుకు ఎవరు ముందుకు రాలేదని, ఈ నేపథ్యంలోనే బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేక డబ్బులు ఇవ్వనున్నామన్నారు. భారత ఆహార సంస్థ ధరల ప్రకారం కిలో బియ్యం ధర రూ.34గా ఉంది. అయితే బియ్యం సర్దుబాటు అయ్యేవరకు కిలో బియ్యం రూ.34 ధరకే అందిస్తామన్నారు. జులై 1 నుంచి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. ఈ మేరకు ఒక్కో వ్యక్తికి నెలకు రూ.170 వస్తాయన్నారు. సదరు కార్డులో ఎంత మంది ఉంటే అన్ని రూ. 170లను కలిపి అందిస్తామన్నారు.