Page Loader
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు
బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజా పరిణామంగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిగా ఉన్న కే. గోవిందరాజన్‌ను పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హేమంత్ నింబాల్కర్‌తో పాటు మరికొంతమంది ముఖ్య పోలీసు అధికారులను బదిలీ చేసినట్టు సమాచారం అందింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా,50మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ తొక్కిసలాటకు కారణంగా,పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకేసారి లోపలికి అనుమతించడమే అని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ సంఘటనపై స్పందించిన కర్ణాటక హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ జరిపింది.

వివరాలు 

బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్

లక్షల మంది అభిమానులు పాల్గొన్న కార్యక్రమ నిర్వహణలో వైఫల్యం ఎవరిదో గుర్తించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషాద ఘటనకు సంబంధించి చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌, ఆర్సీబీ ప్రతినిధులను బాధ్యులుగా గుర్తించి, తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్‌, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సీ. బాలకృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్ డివిజన్) శేఖర్ హెచ్. టెక్కన్నవర్‌, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏకే గిరీష్‌లను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.