కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే గుడిలోకి ప్రవేశించలేదంటూ మరో రగడ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఓ హిందూ దేవాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ రోజుల్లో ఆలయంలోకి ప్రవేశించే ముందు తన చొక్కా విప్పమని అడిగారని, ఇందుకు తాను ఒప్పుకోలేదన్నారు. ఈ మేరకు ఆలయంలోకి ప్రవేశించలేదని చెప్పుకొచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త నారాయణ గురు 169వ జయంతి సందర్భంగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇందులో భాగంగానే దక్షిణాదిలోని పలు ఆలయాల్లోకి ప్రవేశించే క్రమంలో పురుషులు చొక్కాలు తీయాలనే నియమం ఉంది. ఈ మేరకు సిద్ధరామయ్య స్పందించారు. తాను ఓసారి కేరళలోని ఓ ఆలయానికి వెళ్తే అక్కడ చొక్కా తీశాకే లోపలికి ప్రవేశించాలని చెప్పారన్నారు.
దైవం ముందు అంతా సమానమే : సీఎం సిద్ధరామయ్య
అందుకు తాను నిరాకరించానని, ఈ క్రమంలోనే బయట నుంచే ప్రార్థించి వచ్చినట్లు సిద్ధరామయ్య చెప్పారు. చొక్కాలు కూడా అందరినీ తీయమనలేదని కేవలం కొందరికి మాత్రమే అలా చెప్పారన్నారు. ఇలాంటి చర్యలు అమానవీయమని, దైవం ముందు అంతా సమానమేనని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఇప్పటికే హిందూ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని అనడం దేశ రాజకీయాల్లో దుమారం సృష్టించింది. ఈ క్రమంలోనే స్టాలిన్ పై విమర్శలు వెల్లువెత్తుతుండటం గమనార్హం.