
Dharmasthala Murders Mystery: ధర్మస్థలలో హత్యల మిస్టరీపై సిట్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో సంచలనంగా మారిన ధర్మస్థల మిస్టరీ హత్యల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. 1998 నుండి 2014 మధ్య ధర్మస్థలలో చోటుచేసుకున్న వందలాది మిస్టరీ హత్యల ఆరోపణలపై నేడు కర్ణాటక ప్రభుత్వం డాక్టర్ ప్రణవ్ మోహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ధర్మస్థలలో పని చేసిన ఓ మాజీ సానిటేషన్ కార్మికుడు (విసిల్‌బ్లోయర్) సంచలన వివరాలను బయటపెట్టాడు. 1995 నుండి 2014 వరకు మంజునాథ ఆలయంలో పనిచేసిన సమయంలో మహిళలు, మైనర్లు ఎక్కువగా ఉన్న వందలాది మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చినట్టు వెల్లడించాడు.
వివరాలు
ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ
తన మాటలకు బలమైన ఆధారంగా కొన్ని అస్థిపంజరాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఈసంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.అయితే అతను ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సీరియస్ గా పరిగణించింది. విచారణ జరపాలని,ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారికంగా లేఖ రాసింది. దీంతో ప్రభుత్వం స్పందించి, డాక్టర్ ప్రణవ్ మోహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎమ్.ఎన్. అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ దయామ్‌లను సభ్యులుగా కలిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో గతంలో అదృశ్యమైన తమ కుమార్తెల కోసం పలువురు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి విచారణ జరిపించాలని కోరుతున్నారు.