
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన..హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తమపై నమోదైన కేసును వ్యతిరేకిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం ముగ్గురూ కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో, తమపై నమోదైన కేసును కొట్టేయాలన్న అభ్యర్థనను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరిన నేపథ్యంలో, మధ్యాహ్నం సమయంలో కోర్టు విచారణ జరపనుందని సమాచారం.
వివరాలు
ఘటనను సుమోటోగా విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు
ఇదిలా ఉండగా,తొక్కిసలాట ఘటనలో కీలక బాధ్యులుగా భావిస్తున్నఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో పాటు,విజయోత్సవ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గత బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ విషాదకర ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా,50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్వయంగా స్పందించి సుమోటోగా విచారణ చేపట్టింది.
వివరాలు
ఘటనపై దర్యాప్తుకి సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)
ఈ సందర్భంగా, ఈ కార్యక్రమంలో చోటుచేసిన వైఫల్యానికి బాధ్యులు ఎవరో నిర్దేశించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సీఐడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దర్యాప్తు వేగంగా, సమగ్రంగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.