వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేసారు. 80ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనుంది. కర్ణాటక శాసనసభ పదవీకాలం 2023 మే 24 వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు నిర్దిష్ట సమయంలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల్లో ఫారమ్ 12డీ అందుబాటులోకి వస్తుందని, తద్వారా 80 ఏళ్లు పైబడిన లేదా పీడబ్ల్యూడీ ఓటరు ఎవరైనా ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు.
ఎన్నికల నిర్వహణపై సమీక్షించేందుకు కర్ణాటకకు వెళ్లిన ఈసీ బృందం
మొదటిసారిగా కర్ణాటకలో వికలాంగుల(పీడబ్ల్యూడీ) ఓటర్లు, వృద్ధులకు ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పద్ధతి ద్వారా పీడబ్ల్యూడీ ఓటరు ఇంటి నుంచి సులభంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 78, జేడీ(ఎస్) 37సీట్లు గెలుచుకున్నాయి. ముగ్గురు సభ్యులతో కూడిన భారత ఎన్నికల సంఘం బృందం ఎలక్షన్ల నిర్వహణపై సమీక్షించేందుకు కర్ణాటకలో మూడు రోజుల పర్యటనకు వెళ్లింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు బెంగళూరులో ఉన్నారని ఈసీ ట్వీట్‌లో పేర్కొంది.