మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి స్వల్ప అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఉదయం జ్వరం రావడంతో బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గతవారం బిజీగా గడిపిన మాజీ సీఎం, జ్వరం, అలసటకు గురైనట్లుగా సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే కుమారస్వామి సమావేశాలు, కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. కుమారస్వామికి గతంలోనే గుండెకు ఆపరేషన్ చేశారు.ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాజీ సీఎం త్వరలోనే కోలుకుంటారని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సోదర సోదరీమణులందరికీ ఉదయమే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ సీఎం.ఈ పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభం చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.