కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ మేరకు బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది.
ప్రధాన మంత్రిని దూషించే మాటలు కేవలం అవమానకరం, బాధ్యతారహితమేనని పేర్కొంది. దీన్ని రాజద్రోహంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ మేరకు కలబుర్గి ఏక ధర్మాసనం తీర్పునిచ్చింది.
స్కూల్ యజమానులు అల్లావుద్దీన్, అబ్దుల్ ఖలేక్, మహమ్మద్ బిలాల్ ఇనాందార్, మహమ్మద్ మెహతాబ్‌లపై గతంలో న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ప్రధానిని చెప్పుతో కొట్టాలని అనడం అవమానకరమని, బాధ్యతారాహిత్యమని కోర్టు పేర్కొంది.
ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం వేర్వేరు మత వర్గాల మధ్య అల్లర్లకు ప్రేరేపించినట్లు ఈ కేసులో నిర్థారణ కాలేదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ వివరించారు.
DETAILS
ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగానే విమర్శించాలి : హైకోర్టు
సర్కారు విధానాలపై ప్రజల విమర్శలు అనుమతించదగ్గవేనని కోర్టు తెలిపింది. అయితే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానించరాదని స్పష్టం చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా అమలైతే ముస్లింలు దేశాన్ని వదిలేయాల్సి వస్తుందని ఓ నాటికను స్కూల్లో ప్రదర్శించారు. దీని ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు.
ఓ వ్యక్తి సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే,విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందని హైకోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడేలా రెచ్చగొట్టే ఉద్దేశం పిటిషనర్లకు ఉన్నట్టు కనిపించట్లేదని పేర్కొంది.
ప్రభుత్వంపై విమర్శల విషయంలో పిల్లలను దూరంగా ఉంచాలని అన్ని పాఠశాలలకు హైకోర్టు సూచించింది. విద్యా అంశాల్లో వారి సృజనాత్మకతను వెలికి తీసేలా ఉన్న నాటికల ప్రదర్శనలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.