Page Loader
నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా
ఇవాళ యూపీలో రూ.12 వేల కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన

నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 07, 2023
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్‌ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు. తొలుత గోరఖ్‌పూర్ గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు మోదీ హాజరుకానున్నారు. ప్రధాని సారథ్యంలోని కమిటీ ఇటీవలే గీతాప్రెస్‌కు గాంధీ శాంతి బహమతి - 2021 ప్రకటించడం తెలిసిందే. అనంతరం రెండు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. దీంతో పాటు రూ.12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు వజీద్‌పూర్‌ ర్యాలీ సభలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. తర్వాత టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొనే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

DETAILS

యూపీ రైళ్లకు మోదీ మహర్దశ

సుడిగాలి పర్యటనలో భాగంగా గోరఖ్‌పూర్ - లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపనున్నారు. అనంతరం జోధ్‌పూర్-సబర్మతి వందేభారత్ రైలును వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం వారణాసి చేరుకుని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్‌నగర్ మధ్య ఫ్రైట్ కారిడార్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వారణాసి-జైపూర్‌ను కలిపే జాతీయ రహదారి 56 నెంబర్ లో 4 వరుసలతో విస్తరించే పనులు సహా మణికర్ణిక ఘాట్, హరీశ్‌చంద్రఘాట్ పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల అంతర్జాతీయ వసతిగృహానికి రిబ్బన్ కట్ చేయనున్నారు. పీఎం టూర్ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తును సిద్ధం చేశారు.