
Karnataka: లైంగిక వేధింపులపై వివాస్పద వ్యాఖ్యలు.. కర్ణాటక మంత్రి క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారానికి దారి తీసింది.
"పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమే" అనే ఆయన మాటలు తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, హోంమంత్రి మీద విపక్షాలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో, తన వ్యాఖ్యలపై పరమేశ్వర తానే వివరణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
తన మాటలు ఎవరైనా మహిళలకు మనస్తాపం కలిగించాయని భావిస్తే, క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
వివరాలు
సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
"నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.వాటిని వక్రీకరించే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వను. మహిళల భద్రతపై నేను ఎప్పుడూ ఆందోళన చెందే వ్యక్తిని.వారి సంక్షేమం కోసం నిర్భయ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం.నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే, వారినించి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను"అని మంత్రి వివరించారు.
ఇదిలా ఉండగా,గత వారం బెంగళూరులోని సుద్దగుంటెపాల్యలో ఓ వీధిలో ఇద్దరు యువతులు నడుస్తున్న సమయంలో,ఓ వ్యక్తి వారిని వెనక నుండి అనుచితంగా తాకి అక్కడినుంచి పరారయ్యాడు.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో యువతులు భయబ్రాంతులకు గురై అక్కడినుంచి వెళ్లిపోయారు.
అయితే, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా,దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల అభ్యంతరం
దాన్ని ఆధారంగా తీసుకుని బెంగళూరు పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై స్పందించిన పరమేశ్వర, "బెంగళూరుతో పాటు ఇతర పెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు వీధుల్లో తరచూ జరుగుతూ ఉంటాయి" అని వ్యాఖ్యానించారు.
అయితే, బాధిత యువతిపై లైంగిక దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు.
అతనిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే, మంత్రి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహిళల రక్షణకు పాల్పడాల్సిన స్థానంలో ఉన్న మంత్రి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అభాసపాలుచేసే విషయం అని మండిపడుతున్నారు.
అంతేకాక, బీజేపీ నేతలు సైతం పరమేశ్వర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు.