Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఒకే విధమైన ఛార్జీలను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది టాక్సీ డ్రైవర్లు, అదనపు డబ్బు వసూలు చేసే యాప్ ఆధారిత కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ట్యాక్సీ అండ్ అగ్రిగేటర్స్ రూల్ కింద నడిచే వివిధ రకాల ట్యాక్సీలకు ఏకరూప ఛార్జీలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరుతో సహా రాష్ట్ర నిబంధనల ప్రకారం నడుస్తున్న అన్ని టాక్సీలు, సిటీ టాక్సీలు, ఇతర టాక్సీలు (మోటార్ క్యాబ్‌లు), అగ్రిగేటర్లకు ఏకరీతి ఛార్జీలను నిర్ణయించినట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ, ప్రాంతీయ రవాణా అధికారులను ఆదేశించారు.
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు..
యాప్ ఆధారిత టాక్సీలు కొన్నిసార్లు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా పీక్ సీజన్‌లో టాక్సీ ఛార్జీ రెట్టింపు అవుతుంది. అందువల్ల, వివిధ ట్యాక్సీలకు ఒకే మోడల్ ఛార్జీని నిర్ణయించాలని చాలా సంవత్సరాలుగా ప్రయాణికుల నుంచి డిమాండ్ వ్యక్తమైంది. ఈ క్రమంలో కలగజేసుకున్న ప్రభుత్వం.. ఏకరీతిన రేట్లను సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది. వాహనం విలువ రూ.10క్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే కనీసం 4 కి.మీలకు రూ.100గా నిర్ణయించారు. వాహనం విలువ 10 లక్షల నుంచి 15 లక్షల మధ్య ఉంటే, కనీసం 4 కి.మీ.కి ఫిక్స్‌డ్ రేటు రూ.115 ఉంటుంది. వాహనం విలువ 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే, కనీసం 4 కి.మీ.కు రూ.130గా నిర్ణయించారు.