Loading...
Tamil Nadu: సుప్రీంకోర్టు ఉత్తర్వుల వేళ తిరుప్పరంకుండ్రంలో వెలిగిన మహాదీపం
సుప్రీంకోర్టు ఉత్తర్వుల వేళ తిరుప్పరంకుండ్రంలో వెలిగిన మహాదీపం

Tamil Nadu: సుప్రీంకోర్టు ఉత్తర్వుల వేళ తిరుప్పరంకుండ్రంలో వెలిగిన మహాదీపం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక మహాదీపం వెలిగించే విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ.. మంగళవారం సాయంత్రం కొండపై దీపం వెలిగించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద ఉన్న దీప మండపంపై ఏళ్లుగా కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే, ఈసారి సిక్కందర్‌ దర్గా సమీపంలోని రాతి స్తంభంపై దీపం వెలిగించాలనే డిమాండ్‌ తెరపైకి రావడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరగా, అక్కడ దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.

వివరాలు 

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తిరువణ్ణామలై నుంచి వచ్చిన ప్రత్యేక కమిటీ

ఈ పరిణామాల మధ్య మంగళవారం సాయంత్రం ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయ దీప మండపంపై మహాదీపాన్ని వెలిగించారు.

తిరువణ్ణామలై నుంచి వచ్చిన ప్రత్యేక కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

సుమారు నాలుగు అడుగుల ఎత్తు, 70 కిలోల బరువున్న పురాతన రాగి పాత్రలో 400 లీటర్ల నెయ్యి నింపారు.

దాదాపు 150 మీటర్ల పొడవైన వస్త్రంతో భారీ వత్తిని తయారుచేశారు. అనంతరం ఐదు కిలోల కర్పూరంతో ఆ వత్తిని వెలిగించి మహాదీపాన్ని ప్రజ్వలింపజేశారు.

వివరాలు 

భారీ పోలీసు బందోబస్తు

దీపం వెలిగించే అంశంపై వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 23వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు మదురై జిల్లా వ్యాప్తంగా 144 నిషేధ ఉత్తర్వులు అమలు చేశారు.

తిరుప్పరంకుండ్రం కొండ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 12 మంది ఎస్పీలు, ఎనిమిది మంది అదనపు ఎస్పీలు, 57 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు, 132 మంది ఇన్‌స్పెక్టర్లు సహా మొత్తం 5,618 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ధర్మకర్తల మండలి నిర్ణయం ప్రకారమే దీపం

తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని మూలవిరాట్టు శిరస్సుకు సరిగ్గా పైన ఉన్న ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద దీప మండపంపై ఏళ్లుగా కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

ఆలయ సంప్రదాయాలు, ఆగమ నియమాలు, మతపరమైన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మకర్తల మండలి చేసిన తీర్మానం మేరకే అక్కడ దీపం వెలిగించినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు, కొండపై ఉన్న దీప స్తంభంపై దీపం వెలిగించకపోవడాన్ని నిరసిస్తూ హిందూ సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

పోలీసులు హెచ్చరించినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో పలువురిని అరెస్టు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఉత్తర్వులు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు

మదురై జిల్లా వ్యాప్తంగా 144 నిషేధ ఉత్తర్వులు విధించడం చట్టవిరుద్ధమని,వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మదురై ధర్మాసనంలో అత్యవసర పిటిషన్‌ దాఖలైంది.

భక్తులు కొండపై దీపం వెలిగించే కార్యక్రమాన్ని కింద నుంచి వీక్షించేందుకు అనుమతించాలని కూడా పిటిషనర్లు కోరారు.

జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌, జస్టిస్‌ సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, అందువల్ల మదురై ధర్మాసనం విచారణ చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు.

జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌ కృష్ణను కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించడంతో ఆయన న్యాయస్థానానికి వచ్చారు.

పోలీసు కమిషనర్‌ రాజేంద్రన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.

వివరాలు 

ఉత్తర్వులు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు

కొండపై ఉన్న దీప స్తంభం విషయంలో కింద 144 నిషేధ ఉత్తర్వులు ఎందుకు విధించారని న్యాయమూర్తులు అధికారులను ప్రశ్నించారు.

నిషేధ ఉత్తర్వుల కారణంగా భక్తులు గిరివలం చేయలేకపోతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తిరుప్పరంకుండ్రం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న హిందూ సంస్థల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారని తెలిపారు.

తొలుత విచారణను సాయంత్రానికి వాయిదా వేసిన ధర్మాసనం.. తిరిగి విచారణ చేపట్టింది.

సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ ఉత్తర్వులను అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ సందర్భంగా అరెస్టు చేసిన 258 మందిని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.

ADVERTISEMENT