LOADING...
Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ టీవీకేలో సమూల మార్పులకు శ్రీకారం 
కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ టీవీకేలో సమూల మార్పులకు శ్రీకారం

Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ టీవీకేలో సమూల మార్పులకు శ్రీకారం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీ తొక్కిసలాట ఘటన తర్వాత, నటుడు, పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషాదం ద్వారా పాఠాలు నేర్చుకుని, తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే)లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని, పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడం కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గత నెల 27న కరూర్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయి, వందలకు పైగా గాయపడ్డారు. సభా ప్రాంగణం కేవలం 2000-3000 మందిని మాత్రమే పరిగణించగలదని, కానీ దాదాపు 30,000 మంది అభిమానులు, కార్యకర్తలు చేరారు.

Details

కొత్త నాయకత్వం & ప్రత్యేక దళం 

విజయ్ ప్రచార వాహనంపై అభివాదం చేస్తున్న సమయంలో గందరగోళం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇది నిర్వాహకుల వైఫల్యం, జనాన్ని నియంత్రించడంలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఏర్పడింది. ఈ దురదృష్టకర ఘటన విజయ్‌ని తీవ్రంగా ప్రభావితం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా, డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన ద్రావిడ పార్టీల తరహాలో టీవీకేకు ప్రత్యేక స్వచ్ఛంద దళం (వాలంటీర్ ఫోర్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బృందానికి పార్టీ కార్యక్రమాల్లో జనాన్ని నియంత్రించడం, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితులలో స్పందన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే శిక్షణా కార్యక్రమాలను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

Details

నాయకత్వ శూన్యత భర్తీ & ద్వితీయ శ్రేణి నాయకులు

కరూర్ ఘటన తర్వాత, పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సీ ఆనంద్, ఎలక్షన్ డివిజన్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ వంటి కీలక నేతలు న్యాయపరమైన సమస్యల కారణంగా కాస్త పక్కకు వెళ్ళారు. వీరి స్థానాన్ని విజయ్ స్వయంగా భర్తీ చేస్తున్నారు. ఇతర పార్టీలలో అనుభవం ఉన్నవారిని గుర్తించి, ద్వితీయ శ్రేణి నాయకత్వం సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త నాయకుల జాబితాను త్వరలో ప్రకటించి, వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయనున్నారు.

Details

ఎన్నికల ప్రిపరేషన్ & కార్యకర్తల మోటివేషన్

కొత్త నాయకులు జిల్లాల్లో పర్యటించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత వాలంటీర్ బృందాన్ని అధికారికంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ చర్యల ద్వారా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచి, టీవీకేను క్రమశిక్షణ కలిగిన రాజకీయ శక్తిగా నిలబెట్టాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.