
Tulip garden: కశ్మీర్‌లో పర్యాటకుల సందర్శనార్థం తెరుచుకున్న తులిప్ పూదోట..
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియాలో అతిపెద్ద ఇందిరా గాంధీ స్మారక 'తులిప్' తోటను బుధవారం పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు.
50 హెక్టార్ల విస్తీర్ణంలో 17 లక్షల తులిప్ పుష్పాలు వికసించి వర్ణరంజితంగా ప్రకాశిస్తూ, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
డాల్ సరస్సు, జబర్వాన్ కొండల మధ్య విస్తరించిన ఈ తోట తెరవడంతో ప్రతి సంవత్సరం కశ్మీర్‌లో పర్యాటక సీజన్ ఆరంభమవుతుంది.
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఏడాది తులిప్ పుష్పాల ప్రదర్శనను ప్రారంభించి, తోటలో సందర్శకులతో కలిసి విహరిస్తూ ముచ్చటించారు.
వివరాలు
భువిపై స్వర్గానికి స్వాగతం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తులిప్ తోట కశ్మీర్ అపురూప సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రకృతిని ప్రేమించేవారికి ఇది ఒక విశేష ఆకర్షణగా మారుతుందని వివరించారు.
సందర్శకులను ఉద్దేశించి "భువిపై స్వర్గానికి స్వాగతం" అంటూ ఆయన అన్నారు.
ఈ తోటను 2007లో అప్పటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు.
గత సంవత్సరం, ఈ తోటను దేశ, విదేశాల నుండి 4.65 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు.