Page Loader
#NewsBytesExplainer: బీఆర్ఎస్ లో అంతర్గత చిలీక.. కవిత పార్టీకి దూరం కానున్నారా ?.. ఏమి జరుగుతోంది? 
బీఆర్ఎస్ లో అంతర్గత చిలీక..కవిత పార్టీకి దూరం కానున్నారా?..ఏమి జరుగుతోంది?

#NewsBytesExplainer: బీఆర్ఎస్ లో అంతర్గత చిలీక.. కవిత పార్టీకి దూరం కానున్నారా ?.. ఏమి జరుగుతోంది? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తండ్రి అధినేత కేసీఆర్ ఉన్నసమయంలో కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్‌లో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే ఆ ప్రాధాన్యత ఇప్పుడు మెల్లిగా తగ్గిపోతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వరంగల్‌ బహిరంగ సభ సందర్భంగా కేసీఆర్ చిత్రపటం,కేటీఆర్‌ను వారసుడిగా ప్రకటిస్తూ ఫోటో ప్రదర్దించడంపై త‌న మ‌నోగ‌తాన్ని బ‌హిరంగంగానే ప్రకటించారు కవిత. ప్రత్యక్షంగా ప్రకటించకపోయినా,కేటీఆర్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించే ప్ర‌స‌క్తేలేదంటూ ప‌రోక్షంగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర‌తీశారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో అంతర్గత రాజకీయాలు ముదురుతున్నాయని విశ్లేషకుల అంచనా.

వివరాలు 

బీఆర్ఎస్ లో క‌విత గ‌త వైభ‌వ‌మేనా? 

కవిత రాజకీయ జీవితం మొదటి నుంచీ తండ్రి కారణంగా సులభంగా సాగినదే. పార్టీ నియమాలు, నిబంధనలన్నీ ఆమె విషయంలో పాటించాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ కూతురనే ముద్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. బతుకమ్మ పండుగను కూడా కవితతో జోడిస్తూ ప్రచారం నడిపిన సంగతి తెలిసిందే. ఎంపీగా అవకాశమిచ్చి, ఓడిన తర్వాత ఎమ్మెల్సీగానూ చట్టసభలకు పంపారు. ఏ ఎన్నికైనా, ఏ పర్యటనైనా బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతమే పలికేవారు. అధికారంలో ఉన్న‌ప్పుడైతే మంత్రులు కూడా ప్రొటోకాల్ విస్మ‌రించి క‌విత‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు.

వివరాలు 

లిక్కర్ స్కాం నుంచి ప్రారంభమైన మార్పు 

లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితురాలిగా జైలు జీవితాన్ని గడిపిన తర్వాత,కవిత కు పార్టీలో ప్రాధాన్య‌ం త‌గ్గుతూ వ‌చ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీకి ఈ కేసు వల్ల ముద్ర పడకూడదన్న ఉద్దేశంతో ప్రధాన నాయకత్వం ఆమెకు దూరమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. తనను చిన్న చూపుచేస్తున్నారన్న బాధతోనే కవిత "త‌న తండ్రి కేసీఆర్ దేవుడంటూనే ఆయ‌న చుట్టు దెయ్యాలు చేరాయి"అని తీవ్ర ఆరోప‌ణ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన తరువాత తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంతో ఆంతర్యం బయటపడినట్లయింది. తనని తప్పించేయాలని పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్న ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించారు.

వివరాలు 

జాగృతి పార్టీ తో స్వతంత్ర వ్యూహం 

పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే ప్రయత్నాన్ని తానే అడ్డుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై తన అసహనం వ్యంగ్యంగా వ్యక్తం చేస్తూ, తనకు కేసీఆర్ తప్ప మరెవ్వరూ నాయకులుకాదంటూ పరోక్షంగా స్పష్టం చేశారు. కానీ కేటీఆర్ మాత్రం ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయకుండా, వ్యూహాత్మకంగా కవితను పక్కకు నెట్టి, హరీశ్ రావుతో చర్చలు జరిపి తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కవిత తనకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేదని గ్రహించి, తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో దృష్టిపెట్టారు. జిల్లాల పర్యటనలు పెంచుతూ,బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా కార్యాలయాన్ని స్థాపించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

వివరాలు 

జాగృతి పార్టీ తో స్వతంత్ర వ్యూహం 

బొగ్గు గని కార్మిక సంఘాన్ని కూడా తన పర్యవేక్షణలో ఉంచేందుకు కృషి చేశారు. స్వ‌తంత్ర కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తూనే తనను బీఆర్ఎస్ నుంచి ఎవ‌రూ దూరం చేయ‌లేరంటూ ప్రకటిస్తూ చర్చల వేడిని మరింత పెంచుతున్నారు తన రాసిన లేఖ లీక్ అయిన తర్వాత తండ్రి కేసీఆర్‌ను కలవడానికి చాలా కాలమే పట్టింది. కాళేశ్వరం విచారణ సమయంలో తండ్రిని కలిసినా,ఆయ‌న‌తో మాట్లాడ‌లేదు. ఇక ఇటీవల వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్‌కి వచ్చిన సందర్భంలో మాత్రమే కేసీఆర్‌ను కలిసి పరామర్శించారు.

వివరాలు 

క‌వితకు చెక్ పెడుతున్నారా? 

బొగ్గు గని కార్మిక సంఘంపై తన పట్టు వదులుకోవడం కవితకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశాలు జరగడం,కవితను పక్కన పెట్టి ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి ఈచర్య అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న కేసులో కూడా మౌనం తీన్మార్ మల్లన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు చేసినా,కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు వంటి నాయకులు ఎలాంటి మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం శాసన మండలి పక్ష నేత మధుసూదనాచారి మాత్రమే మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. మిగతా నేతలు మౌనంగా ఉన్నారు.కేటీఆర్ ఇతర విషయాలపై సోషల్ మీడియాలో స్పందించినా,ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు.

వివరాలు 

బీసీ రిజర్వేషన్ల అంశంలో భిన్న స్వరం 

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ నుంచి భిన్నంగా కవిత స్పందించారు. బీఆర్ఎస్ తప్పుదారి పట్టిందని, ఎప్పటికైనా తాను సూచించిన మార్గంలోకి రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. దీనితో బీఆర్ఎస్ లో ఆమె ఉన్నారో, లేరో అన్న సందేహాలు మళ్లీ మొదలయ్యాయి.

వివరాలు 

కవిత భవిష్యత్ ఎటువైపు?

ప్రస్తుతం బీఆర్ఎస్ అధిష్టానం తన పట్ల అనుసరిస్తున్న ధోరణిని గమనించి, కవిత తన స్వతంత్ర రాజకీయ వ్యూహాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నుంచి బయటకు నెట్టివేయాలని చూస్తున్నారా? లేక స్వయంగా దూరమయ్యే అవకాశానికి ఎదురు చూస్తున్నారా? అన్న ప్రశ్నలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నతో విభేదాలు స్పష్టమవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడాన్ని కూడా రాజకీయ పరిశీలకులు గుర్తిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ లో రానున్న రోజుల్లో జరిగే పరిణామాల పట్ల రాజకీయ వర్గాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రబలమైన ఆసక్తి నెలకొంది. కవిత ఎటు వెళ్లనున్నారు అన్నది అందరిలోనూ నెలకొన్న ప్రశ్న.