నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఆమెను శనివారం 9 గంటల పాటు విచారించారు. అయినా గురువారం మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కవిత గురువారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. మరోవైపు బుధవారం ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన సాక్ష్యాలను ధృవీకరించినట్లు సమాచారం. కవిత తరపున బినామీగా వ్యవహరించానన్న ప్రకటనను ఉపసంహరించుకోవాలని పిళ్లై కోర్టును ఆశ్రయించగా, బుచ్చిబాబు ఇచ్చిన సాక్ష్యాలతో ఈడీ తూట్లు పొడిచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కవిత విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
బుధవారం సుప్రీంకోర్టు సహాయంతో తనపై ఈడీ దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కవిత
మనీష్ సిసోడియా కస్టడీ ఈ నెల 17తో ముగియనుంది, పిళ్లై కస్టడీ గురువారంతో ముగియనునుంది అందుకే ఇప్పుడు ఈ కేసులో కవిత పాత్రను ఛేదించేందుకు ఈడీ ప్రయత్నించవచ్చని సమాచారం. ఈ పరిణామాలను ముందే ఊహించిన కవిత బుధవారం సుప్రీంకోర్టు సహాయంతో తనపై ఈడీ దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆమె పిటిషన్‌ను వెంటనే విచారించడానికి అంగీకరించలేదు. స్టే కూడా ఇవ్వడానికి నిరాకరించారు. కవిత బుధవారం ఢిల్లీలోని మెరిడియన్ హోటల్‌లో మహిళా రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆమెకు సంఘీభావంగా ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్, మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు.