
Kavitha: కేసీఆర్ ఫొటో లేకుండానే... తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల యాత్రకు కవిత శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే యాత్రలో తన తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని ఉపయోగించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'సామాజిక తెలంగాణ' లక్ష్యంగా, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆమె నిర్ణయం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత ఈ యాత్రను ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రంలోని 33 జిల్లాలన్నింటిని సందర్శించేందుకు కవిత సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. యాత్ర వివరాలు, షెడ్యూల్‌తో కూడిన పోస్టర్‌ను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆమె విడుదల చేయనున్నారని వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
యాత్రకు రాజకీయంగా ప్రాధాన్యత
ఈ యాత్రలో భాగంగా కవిత రాష్ట్రంలోని మేధావులు,విద్యావంతులు,వివిధ వర్గాల ప్రజలతో భేటీ అవుతూ,భవిష్యత్ రాజకీయ దిశపై వారి అభిప్రాయాలు,సూచనలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీయగా, ఇప్పుడు ప్రారంభం కానున్న ఈ యాత్రకు మరింత రాజకీయ ప్రాధాన్యత లభించింది. ప్రజల నుంచి వచ్చే స్పందనను, మద్దతును పరిశీలించిన అనంతరం కవిత తన స్వంత రాజకీయ పార్టీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఫొటోను పక్కనపెట్టి యాత్ర చేయాలన్న ఆమె నిర్ణయం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది. మొత్తంగా, కవిత యాత్ర తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశముందనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.