ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం - సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనిపై ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఉద్యమం 58ఏళ్లు సాగడానికి కారణం ఎవరని నిలదీశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రు కాదా అంటూ ప్రశ్నించారు. 1956లో ఇక్కడి ప్రజలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ఆంధ్రలో తెలంగాణను కలిపేశారని మండిపడ్డారు. 1969లో ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అణిచేసిందని, ఆ ఉద్యమంలో ఎందరో విద్యార్థుల ప్రాణాలు పోయాయన్నారు.
కాంగ్రెస్ నేతలు మంత్రి పదవి రాగానే దుకాణం మూసేస్తారని కేసీఆర్ ఎద్దేవా
టీడీపీ హయంలో సభలో తెలంగాణ పదాన్ని వాడొద్దంటే కాంగ్రెస్ పార్టీ మౌనం వహించిందని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ అనడం, మంత్రి పదవి రాగానే దుకాణం మూసేశారని చురకలు అంటించారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ చార్జీల పెంపు ఉదంతాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో భాగంగా తెలంగాణలో పోలింగ్ పూర్తి కాగానే అప్పటి సీఎం వైఎస్ హైదరాబాద్ వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలని అన్నట్లు గుర్తు చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం తెలంగాణను చాలాసార్లు అవమానించారని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటే టీ.కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్నారు. తనకు పిండం పెడతారని విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు.