Page Loader
KCR: విచారణ కమిషన్‌ ముందు హాజరు కాలేనన్న కేసిఆర్
KCR: విచారణ కమిషన్‌ ముందు హాజరు కాలేనన్న కేసిఆర్

KCR: విచారణ కమిషన్‌ ముందు హాజరు కాలేనన్న కేసిఆర్

వ్రాసిన వారు Stalin
Jun 15, 2024
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ కొనుగోలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్‌ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్‌ కొనుగోలు విషయంలో జస్టిస్‌ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఈమేరకు కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్‌ రంగం సంక్లిష్టంగా వుంది

వివరాలు 

రాజకీయ కక్షతో  కమిషన్ 

రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్‌ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది మందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే కమిషన్ వేశారు‌.

వివరాలు 

విద్యుత్ చట్టం 2003 ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంస్ధలనుంచి అనుమతి

మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చూపించేందుకే ప్రభుత్వ ప్రయత్నాలు. మీరు ఒక మాజీ హైకోర్టు జడ్జి అయి వుండి కూడా ఇలా మాట్లాడటం తగదని కేసీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అనవసరమైన అభాండాలు వేయవద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంస్ధలనుంచి అనుమతి పొందాకే పై నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

వివరాలు 

ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలవాలి 

పత్రికా విలేఖరుల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది.ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు.నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. విచారణ ముగియక ముందే తనపై అవాస్తవాలు చెపుతున్నారని ధ్వజమెత్తారు.ఈపరిస్ధితుల్లో మీ కమిషన్‌ ముందు హాజరు కాలేనని విస్పష్టంగా పేర్కొన్నారు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా'అంటూ కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు