ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి
పాఠశాలల్లో పాఠాలు బోధించే గురువును సంబంధించే అంశంపై కేరళ బాలల హక్కల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో ఉపాధ్యాయుడిని 'సార్' అని, ఉపాధ్యాయురాలినిని మేడమ్ అని సంభోదించవద్దని పేర్కొంది. పాఠశాలల్లో ఈ రెండు పదాలకు బదులుగా ఇద్దరినీ 'టీచర్' అని సంబోధించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠాశాల యాజమాన్యాలకు మార్గ దర్శకాలను జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. విద్యార్ధి దశలోనే సార్, మేడమ్ అంటూ.. లింగబేధాలను చూపించొద్దని, అందరూ సమానమే అని చాటి చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలల హక్కల కమిషన్ వివరణ ఇచ్చింది.
'ఉపాధ్యాయలు-విద్యార్థుల మధ్య బంధం మరింత బలపడుతుంది'
వాస్తవానికి గత వారమే.. టీచర్ అనే పదాన్ని ఇద్దరికీ ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కేరళ బాలల హక్కల కమిషన్ ఆదేశించింది. తాజాగా ఆ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. సార్, మేడమ్ అని పిలవడం వల్ల వేర్వేరురు అనే భావనలు కలుగుతాయని, టీచర్ అని పిలవడం వల్ల ఉపాధ్యాయలు- విద్యార్థుల మధ్య బంధం మరింత బలపడుతుందని కేరళ బాలల హక్కల కమిషన్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది. అయితే కేరళ బాలల హక్కల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.