K P Viswanathan: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ విశ్వనాథన్(K P Viswanathan) శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 83. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్.. ఈ రోజు తెల్లవారుజామున కేరళ త్రిసూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథన్ 1991-1994, 2004-2005 మధ్య అటవీ, వన్యప్రాణుల మంత్రిగా పనిచేశారు. ఆయన ఏప్రిల్ 22, 1940న త్రిస్సూర్ జిల్లాలోని కున్నంకులం తాలూకాలో కల్లయిల్ పంగన్, పారుకుట్టి దంపతులకు జన్మించారు. తన ప్రాథమిక విద్య తర్వాత, విశ్వనాథన్ కేరళ వర్మ కళాశాల, త్రిస్సూర్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆయన న్యాయవాది కూడా. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1967 నుండి 1970 వరకు యూత్ కాంగ్రెస్ త్రిస్సూర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
2006, 2011లో సీపీఎం అభ్యర్థి చేతిలో ఓటమి
1977, 1980, 1987లో కున్నంకుళం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వనాథన్ గెలుపొందారు. 1987, 1991, 1996, 2001లో కొడకరా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కొడకరా నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి సి రవీంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. విశ్వనాథన్ త్రిస్సూర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (1972), రాష్ట్ర కొబ్బరి రైతు సమాఖ్య అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.