
Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు..3 ఏళ్ళ చిన్నారికి పాజిటివ్, 23కి చేరిన మరణాల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్)' అనే అరుదైన వ్యాధి కేరళలో కలకలం సృష్టిస్తోంది. తాజాగా 3 ఏళ్ళ చిన్నారికి పాజిటివ్ నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వివరాల ప్రకారం, కన్నూర్ జిల్లా తాయిల్ ప్రాంతంలో ఉండే మూడున్నర వయస్సు ఉన్న ఓ చిన్నారికి.. సిరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (CSF) నమూనాలను పరీక్షించిన ఫలితాల్లో నైగ్లీరియా ఫౌలెరి (Naegleria fowleri)ఉనికిని నిర్ధారించింది. ఇదే సమయంలో, ఈ మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా రాష్ట్రంలో 104 కేసులు నమోదవగా,అందులో 23 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం వెల్లడించారు. అలాగే, కొల్లాం,తిరువనంతపురం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు కాగా,కోజికోడ్,మలప్పురం జిల్లాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వివరాలు
అకాంతమోబా సంబంధిత కేసుల్లో మరణాల రేటు 70 శాతం పైగా..
"ప్రపంచవ్యాప్తంగా, నైగ్లీరియా ఫౌలెరి కారణంగా వచ్చే అమీబిక్ ఇన్సెఫాలైటిస్ మరణాల రేటు 98 శాతానికి పైగా ఉంది. అకాంతమోబా సంబంధిత కేసుల్లో మరణాల రేటు 70 శాతం పైగా ఉంటుంది. అంతర్జాతీయంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, కేరళలో ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స అందించడం వలన మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది" అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, రాష్ట్రంలో అన్ని విభాగాలు కలిసి శాస్త్రీయంగా క్లోరినేషన్, ఇతర నివారణ చర్యలను నిరంతరం అమలు చేస్తున్నారు.